

భక్త కవి యోగి
చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య స్వామి
సామాన్యులుగా జన్మించినా, మాన్యులుగా ఎదిగి, ధన్యజీవులుగా ప్రజల హృదయాల్లో కొలువైన పుణ్యచరితులు చరిత్రపుటల్లో అరుదుగా కనిపిస్తారు. అటువంటి విలువైన మహనీయుల్లో చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యకవిగారు ఒకరు. వారు వసించిందేమో ధర్మవరం అనే ఒక పల్లెటూళ్ళో. నేపథ్యం చూస్తే వ్యవసాయం చేసుకునే దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం. చరించిందేమో తరతరాలుగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపుపొందిన పలనాడు ప్రాంతం. అయినా కులవృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తూనే గురువుల అనుగ్రహంతో భారతీమాత కృపతో, కవిత్వాన్ని సొంతం చేసుకొని పలు రచనలు చేసిన కవిపుంగవుడు చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యకవి. అనవద్యహృద్యపద్యరచన చేయడమేకాక అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు మాదిరిగా సంగీత ప్రధాన మైన కీర్తనలు రచించి వాగ్గేయకారులుగా కీర్తి గడించిన మహనీయుడు ఆయన. దుర్గిలో వెలసిన శ్రీవేణుగోపాలస్వామికి భక్తుడై, ఆ స్వామి కృపకు పాత్రుడై తన మహిమలతో ఆ ప్రాంత ప్రజల అభిమానాన్ని సంపాదించుకొన్న భక్తయోగి ఆయన. ఆయన పవిత్ర పాదస్పర్శతో ఆ ప్రాంతం పులకించి, పునీతమయింది.
