About Us
అయినా కులవృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తూనే గురువుల అనుగ్రహంతో భారతీమాత కృపతో, కవిత్వాన్ని సొంతం చేసుకొని పలు రచనలు చేసిన కవిపుంగవుడు చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యకవి. అనవద్యహృద్యపద్యరచన చేయడమేకాక అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు మాదిరిగా సంగీత ప్రధాన మైన కీర్తనలు రచించి వాగ్గేయకారులుగా కీర్తి గడించిన మహనీయుడు ఆయన. దుర్గిలో వెలసిన శ్రీవేణుగోపాలస్వామికి భక్తుడై, ఆ స్వామి కృపకు పాత్రుడై తన మహిమలతో ఆ ప్రాంత ప్రజల అభిమానాన్ని సంపాదించుకొన్న భక్తయోగి ఆయన. ఆయన పవిత్ర పాదస్పర్శతో ఆ ప్రాంతం పులకించి, పునీతమయింది. సుబ్రహ్మణ్య కవిశేఖరులు వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. శతకాలు, యక్షగానాలు, ద్విపదలు, కీర్తనలు, ఏలలు, చూర్ణికలు, లాలిపాటలు, జోలపాటలు – ఇలా ఎన్నో వారి కలం నుండి అలవోకగా జాలువారాయి. వారి కవిత్వం భక్తిభరితం. వారి భావనాశక్తి రససంభరితం. వారి కవితాధార అనన్యం; అగణ్యం. వారి కవిత్వంలో భక్తిభావాలతో పాటు సామాజిక స్పృహ, సేవాతత్పరత దోబూచులాడుతుంటాయి. సుబ్రహ్మణ్యకవి మహిమాన్వితుడు. ఆధ్యాత్మిక రహస్యాలతోపాటు, రాజయోగ రహస్యాలు ఎరిగిన ప్రోడ. వేదాంత, తాత్విక విశేషాలు సాకల్యంగా గ్రహించిన యోగిపుంగవుడు.

ఆయనది వశ్యవాక్కు. ఆయన పలికినది జరుగుతుందనడానికి ఎన్నో తార్కాణాలున్నాయి. ఆయనను నమ్మక నష్టపోయినవారున్నారు గాని, నమ్మి చెడినవారు లేరు.
అటువంటి కవియోగి సుబ్రహ్మణ్యస్వామి క్రీ.శ.1802వ సంవత్సరంలో తిరుమలమ్మ-నరసయ్య పుణ్యదంపతులకు ఓబులేశునిపల్లెలోని మాతామహుల ఇంటిలో జన్మించారు. వీరి ధర్మపత్ని వేణమ్మగారు. 1882వ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం పుష్య బహుళ అష్టమినాడు వారు స్వచ్ఛందంగా భౌతికశరీరాన్ని త్యాగం చేశారు. వారు దేహాన్ని విడిచిన ఆ తిథినాడు అప్పటి నుండి ధర్మవరం ప్రాంతంలో ఆరాధనోత్సవాలు జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ ఆరాధనోత్సవాలకు జనం భక్తితాత్పర్యాలతో తండోపతండాలుగా హాజరవుతారు.
పలనాడు ప్రజలు ఆ భక్తకవియోగిని సుబ్బయ్య, సుబ్బదాసు, తాతయ్య, సుబ్రహ్మణ్యస్వామి, సుబ్రహ్మణ్యకవి, సుబ్రహ్మణ్యదేశికులు అని గౌరవంగా భక్తి ప్రపత్తులతో వ్యవహరిస్తుంటారు. ఇటీవలికాలంలో కొందరు భక్తులు మాలధారణ చేస్తూ వారిని సుబ్రహ్మణ్యగురుస్వామి అని సంభావిస్తున్నారు. అలాగే ధర్మవరంలో శిల్పశోభితంగా కన్నులకింపుగొలిపే సుబ్రహ్మణ్యకవి మఠాన్ని, విగ్రహాన్ని ప్రతి నిత్యం పలువురు భక్తులు దర్శించి తరిస్తుంటారు. సుబ్రహ్మణ్యకవి మహాకవి. స్వయంకృషితో, గురుకృపతో సంస్కృతాంధ్రాలలో పాండిత్యాన్ని సంపాదించారు. కమ్మని కవిత్వాన్ని పండించారు. అందుకనే ప్రముఖ కవి, సాహితీవేత్త కొండవీటి వేంకటకవి సుబ్రహ్మణ్యకవి గురించి “పుణ్యపురుషుల, లోకోత్తర గుణోత్తరుల జీవిత విశేషాలు ముందువారికి ఆదర్శాలు, మార్గదర్శకాలు. అష్టాక్షరీమంత్ర పారాయణంతో సాయుజ్యమందిన భక్తయోగి సుబ్బదాసుగారు, అష్టశతకాలు రచించడం వారి విశిష్టాద్వైత ప్రవృత్తికి ప్రబల తార్కాణం” అని వాక్రుచ్చారు.
చిరుమామిళ్ళ సుబ్బదాసు కారణంగా వారి వంశం ధన్యం. వారి గ్రామమైన ధర్మవరం ధన్యం. వారి ప్రాంతమైన పలనాడు ధన్యం. ఆ వంశంలో జన్మించిన వారందరు ధన్యజీవులు.